Sunday, May 3, 2020

వేమన పద్యాలు – సంస్కృతానువాదము 1. మూర్ఖపద్ధతిః

వేమన పద్యాలు సంస్కృతానువాదము
ఇది వేమన పద్యాలకు సంస్కృతానువాదం. ఎస్.ఎన్.శ్రీరామదేశికన్ అనేవారు చేసినది. ఈ పుస్తకం నా చేతికి అందటం కూడా ఓ విచిత్ర ఘటన. మా స్వర్వాణి (వాట్సాప్) సదస్సులో ఒకరికి ఇది ఎక్కడో రెండవవాడకం పుస్తకంగా లభ్యమైందిట. వారు నాకు సందేశం పంపి, కొన్ని పుటలు పంపారు- "తెలుగుదానిలా ఉంది, నాకు తెలుగు రాదు. మీకు ఉపయోగపడుతుందేమోన"ని. నేను కళ్ళకద్దుకుని తీసుకుంటానని చెప్పాను. పాపం- పోస్టు పంపారు. ఇది క్రితం (2019) సెప్టెంబరులో జరిగింది.
అందుకున్నాక ఊరుకోము కదా. టంకనం ప్రారంభించాను. నా వల్ల కాక చి. కార్తీక్ (మా కార్యాలయంలో పసి యువకుడు) కి అందించాను. ఆ యువబాలుడు టంకనం చేసి ఇవ్వగా, మన సదస్సులో మురళిగారు తప్పులు సరిదిద్ది ఇవ్వగా, శ్రీనివాస్ గారు డిజైన్ చేసి ఇవ్వగా ఈ కార్యం ఈ రూపం దాల్చింది. మీ అందరికి ప్రేమతో సమర్పితం.

1. మూర్ఖపద్ధతిః

అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
యజ్ఞాన మణఁచి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందఁ జూడర వేమా.         1.1
బ్రహ్మజ్ఞానాత్ భవేద్విప్రః తద్విహీనో ద్విజేతరః
శ్రుతిసిద్ధమిదం జ్ఞానాద్వాల్మీకిర్బ్రహ్మతాం యయౌ  
అడవయడవిఁ దిరిగి యాసను విడలేక
గాసిపడెడువాఁడు ఘనుఁడు గాఁడు
రోసిరోసి మదిని రూఢిగా నిలిపిన
వాఁడె పరముగన్నవాఁడు వేమ.                     1.2
మనోనిగ్రహశీలస్య వనవాసో వృథాశ్రమః
ఏకాగ్రచిత్తో నిష్కామీ పరమం ద్రష్టుమర్హతి ॥
అదిమి మనసునిలిపి యానందకేళిలో
బ్రహ్మమయుఁడు ముక్తిఁ బడయఁ గోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.3
జిత్వా మనో బ్రహ్మభావాదానన్దం భజతే గుణీ
జిహ్వాచాపల్యతోఽశక్తాః క్లిశ్యన్తే చిత్తనిగ్రహే
అరయ సుఖమొంది దుఃఖమ్మునార్పలేక
విధిని దూఱంగ ఫల మేమి వేడుకలర
బుద్ధినొక్కినఁ బరిపూర్తిఁ బొందునయ్య
అట్లు కాకూరకయె యుండుదగును వేమ.        1.4
మూఢో లబ్ధం సుఖం భుఙ్క్తే దుఃఖే  దైవం వినిన్దతి
చిత్తశుద్ధౌ భవేత్ సౌఖ్యమన్యథా జీవనం వృథా
అనువుగానిచోటఁ బనికొని జూదము
నాడి కూడి యోడి యడవిసొచ్చు
ఘనునిజాడఁ జూడ గడువుము మూర్ఖత
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.5
ద్యూతే నష్టధనో మూర్ఖో విరక్త్యా వనమావిశేత్
తస్మాన్మహాత్మనాం మార్గం ప్రవిశ త్యజ మూర్ఖతామ్
అలయఁ జేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటిక దేబెల్ల
నెలమి మన్ను దినెడు నెఱ్ఱలౌదురుసుమీ
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.6
అశుద్ధధాన్యదాతారః కఠినా యాచకాయ యే
మృద్భుగ్భూనాగజాతీయాః జాయన్తే తే మహీతలే
అవులఁ గామెఱుఁగక యజ్ఞానజీవులు
మూలమును దెలియక ముట్టుచేత
ననుదినము సృజింతు రాత్మఁ దెలియలేక
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.7
స్వదుష్కృతిమనాలోచ్య విస్మృత్య జగతః ప్రభుమ్
అజ్ఞా భోగేచ్ఛయా పుత్రాన్ జనయన్తి దినే దినే
ఆత్మనెఱుఁగని నుతి యట్టిట్టు చేసిన
వానిమెచ్చువాఁడు వట్టివాఁడె
ముక్కిడిదియుఁ బాడ మొండియు మెచ్చఁడా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.8
అనాత్మజ్ఞస్య మూర్ఖస్య స్తుత్యా మూర్ఖో హి మోదతే
యథా వినాసికాగానం శ్రుత్వా పఙ్గుః ప్రహృష్యతి
అభిజాత్యముననె యాయువున్నంతకుఁ
దిరుగుచుంద్రు భ్రమలఁ దెలియలేక
మురికిభాండమునను ముసరు నీఁగలరీతి
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.9
ఆభిజాత్యమదాదజ్ఞా న త్యజన్తి భ్రమం సదా
అశుద్ధభాణ్డముత్స్రష్టుం యథా నేచ్ఛన్తి మక్షికాః
ఆలిమాటలు విని యన్నదమ్ములరోసి
వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుఁడు
కుక్కతోఁకఁబట్టి గోదావరీఁదును
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.10
మన్దా భార్యావచః శ్రుత్వా యే త్యజన్తి చ సోదరాన్
తే యతేరన్ శ్వపుచ్ఛేన తర్తుం గోదావరీం నదీమ్
ఆసనంబెఱుఁగక యానామకర్మంబు
గురువు చేతఁ దెలిసి గూర్పకున్న
మనసు నిలుపకున్న మరి ద్విజుండెట్లగు[1]
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.11
ఆసనాని గురోర్జ్ఞాత్వా వైరాగ్యేణ హరౌ మనః
నిబన్ధుం యో న శక్నోతి స కథం బ్రాహ్మణోత్తమః
ఇట్టు ఘటములోనఁ బెట్టినజీవుని
గానలేక నరుఁడు కాశి కేఁగి
వెదకివెదకి యతఁడు వెఱ్ఱియై పోవును
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.12
స్వదేహస్థం హరిం త్యక్త్వా గత్వా కాశీగయాదికమ్
అపశ్యన్ బహుధాన్విష్య మూర్ఖో భవతి మానవః
ఇంటియాలి విడిచి యిలజార కాంతల
వెంట తిరుగువాఁడు వెఱ్ఱివాఁడు
పంటచేను విడిచి పరిగ యేఱినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.13
ఊఢాం భార్యాం పరిత్యజ్య పరదారపరిగ్రహీ
పక్వం కేదారముత్సృజ్య యవాన్వేషకవద్ భవేత్
ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
వెఱ్ఱిమనుజుఁడెల్ల వెదకు శివుని
ఇంద్రియములరోసి యీశునిఁజూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.14
విషయాసక్తచిత్తస్తు ద్రష్టుమీశం న శక్నుయాత్
సర్వేన్ద్రియాణి నిర్జిత్య తతః పశ్య మహేశ్వరమ్
ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమ
ఎఱుక గల్గువారె యెచ్చువారు
ఎఱుక లేనివార లేజాతినున్నను
హీనజాతియంచు నెఱుఁగు వేమ.                   1.15
ఉత్తమాస్తే మతా జాత్యా యే తత్త్వజ్ఞానసంయుతాః
అధమాస్తే మతా జాత్యా యే తత్త్వజ్ఞానవర్జితాః
ఇహమునందుఁబుట్టి యింగితమెఱుఁగని
జనులనెంచి చూడ స్థావరములు,
జంగమాదులనుట జగతినిఁ బాపము
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.16
మన్యన్తే స్థావరైస్తుల్యా నరా ఇఙ్గితవర్జితాః
జఙ్గమే గణనం చాపి తేషాం పాపకరం భవేత్
ఈతగింజవంటి దెఱిఁగియు దానికే
యాసపడును మూర్ఖుఁ డవనిలోనఁ
దోయజాక్షిఁ జూచి తొలఁగంగ వశమౌనె?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.17
ఖర్జూరబీజవద్ గుహ్యమితి జ్ఞాత్వాపి మన్దధీః
కామార్తస్తరుణీం దృష్ట్వా న తతో వినివర్తతే
ఉత్తతిత్తి దీనియుపయోగములు లేవు
తిత్తికొఱకుఁ జెడును దేవులాడి
కత్తిమీఁదిసాము కడతేరఁబోదయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.18
భస్త్రికాసదృశస్త్రీషు ముగ్ధో లోకో వినశ్యతి
కృపాణస్యోపరి యథా ఖేలనాన్నాశమశ్నుతే
ఉన్నదానినిగను మూపిరిబిగఁబట్టి
కన్నుమూసి యేమి కానలేవు
విన్నదన్న దెఱుక విజ్ఞానమని నమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.19
శ్వాసనేత్రనిరోధేన న శక్యం తత్త్వదర్శనమ్
సద్భ్యో గురుభ్యో యద్ జ్ఞాతం తత్ తత్త్వమితి భావయ
ఋషులెఱుంగనట్టి విషయంబు భువి లేదు
వారు సెప్పినంత వరుసనగును
తెలియకనెడు వారు దేబెలు నిజమయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.20
త్రికాలజ్ఞమహర్షీణామజ్ఞాతం నాస్తి కిఞ్చన
సర్వం తదుక్తం సత్యం స్యాద్ యో న వేత్తి స మూఢధీః   ||
ఎక్కువయును తక్కు వెట్టివి వారికి
తనువు సతము గాదు తథ్యమరయ
నెఱిఁగి తిరుగ లేరిఁ కేమన మూర్ఖులు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.21
సామ్యవాదరతాః ప్రాజ్ఞాః కాయో నశ్వర ఇత్యముమ్
బుద్ధ్వాప్యకృతబుద్ధీనాం మౌర్ఖ్యం కిమితి వర్ణ్యతామ్
ఎడ్డెఁ దెల్పవచ్చు నేఁడాదికైనను
మౌనిఁ దెల్పవచ్చు మాసముననె
మొప్పెఁ దెల్పరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.22
మూఢో జ్ఞానీ భవేన్మాసి  మౌనీ వర్షే చ శిక్షణాత్
త్రింశద్వర్షం శిక్షితోఽపి మూర్ఖో జ్ఞానమాప్నుయాత్
ఎండనీడచంద మెఱుఁగ నేరఁడ యోగి
యుండు నెల్లకాల ముర్విమీఁదఁ
దిండిపోతు నాఁగఁ దిరుగుచునుండురా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.23
ఛాయాతపౌ సమౌ జ్ఞాత్వా కేవలాశనతత్పరమ్
అటన్తం యోగినం స్వేన సమం మూర్ఖో హి మన్యతే
ఎంతచదువుఁ జదివి యెన్ని యో విన్నను
హీనుఁ డవగుణంబు మానలేఁడు
బొగ్గు పాలఁగడుగఁ బోవునా నైల్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.24
విద్వాన్ బహుశ్రుతో వాపి మూర్ఖో న గుణవాన్ భవేత్
క్షీరేణ క్షాలితోఙ్గారో జహాతి కిము కృష్ణతామ్
ఎదుటనున్నవాని నెప్పుడుగానక
కుదుటివానివెదుకఁ బదురుచుంద్రు
పదటకొడుకులకును భయ మేలగల్గదు?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.25
హరిం సర్వగతం త్యక్త్వా తదర్థం పర్యటన్ జగత్
జ్ఞానినాం పరిహాస్యః స్యామితి మూర్ఖో న లజ్జతే
ఎలుకతోలు తెచ్చి యెందాక నుదికిన
నలుపు నలుపె కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మఁ దెచ్చి కొట్టిన గుణియౌనె
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.26
న శ్వేతం మూషికాపుచ్ఛం స్యాద్వర్షం శోధనాదపి
న దారుప్రతిమా జల్పేత్ తాడితాపి, తథా జడః
ఒకని జెఱుతు మంచు నుల్లమం దెంతురు
తమకుఁ గలుగు చేటుఁ దామెఱుఁగక
తమ్ముఁ జెఱుచువాఁడు దైవంబు గాఁడొకో
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.27
పరహింసాకరాన్ మర్త్యాన్ దైవం నూనం వినాశయేత్ “
ఇత్యనాలోచ్య మూఢోఽసౌ పరాన్ హింసితుమీహతే
ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావ మిచ్చి మెచ్చు పరమలుబ్ధు
పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.28
అజ్ఞేషు ప్రీతిరజ్ఞానాం లుబ్ధానాం లేభవత్సు చ
వరాహః పఙ్కమన్విచ్ఛేత్ సుగన్ధోఽస్మై రోచతే
ఓగుబా గెఱుఁగక యుత్తమూఢజనంబు
లిల సుధీజనముల నెంచఁ జూచు
కరిని గాంచి కుక్క మొఱిఁగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.29
వివేకరహితా మూఢా దూషయేయుర్విపశ్చితః
వీథ్యాం గజం సమాలోక్య శునకో బుక్కతే యథా
ఔ నటంచు నొక్కఁ డాడినమాటకు
కా దటంచుఁ బలుక క్షణము పట్టు
దాని నిలువఁ దీయఁ దాతలు దిగవలె
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.30
ఉక్తస్య నేతి కథనం క్షణమాత్రేణ సాధ్యతే
అస్తీతి సాధనీయం చేదాగన్తవ్యం పితామహైః

ఔర యెంతవార లల్లరిమానవుల్
ప్రభువు నైన గేలిపఱతు రెన్నఁ
దాఁ దెగించువాఁడు దండియౌ భువిలోన
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.31
వివేకరహితా మూర్ఖాః ప్రభూన్ పరిహసన్త్యపి
త్యక్తలజ్జాభిమానా హి లభన్తే జగతి ప్రథామ్
కండకావరమునఁ[2] గానఁడు మరణంబు
మదముచేతఁ దత్త్వమహిమఁ గనఁడు
భోగవాంఛ చేతఁ బురహరుఁ గానఁడు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.32
ధనేన దేహదార్ఢ్యేన మూర్ఖో మృత్యుం న పశ్యతి
న వేత్తి తత్త్వం, విషయసుఖాదీశం న వన్దతే
కన్నులందు మదము గప్పి కానరు గాని
నిరుడు ముందటేఁడు నిన్న మొన్న
దగ్ధు లైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.33
గతే వర్షే పూర్వదినే మహాన్తః కతి వా మృతాః
న లఙ్ఘ్యో మృత్యురిత్యేతన్మదాన్ధో నేక్షతే జడః
కఫము మీఱి మఱియుఁ గనులు మూఁతలువడి
బుద్ధి తప్పి చాలఁ బుడమి మఱచు
వేళలందు నిన్ను వెదకుట సాధ్యమా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.34
కఫావృతో నష్టదృష్టిః స్మృతిహీనశ్చ మానవః
ప్రపఞ్చజ్ఞానశూన్యోఽయం హరిం ద్రష్టుం కథం క్షమః ?
కర్మగుణములన్ని కడఁ బెట్టి నడవమి
దత్త్వ మెట్టు తన్నుఁ దగులు కొనును
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.35
జ్ఞానేన దృశ్యతే తత్త్వం న తత్కారణకర్మణా
తైలేన రాజతే దీపో న తిలైస్తైలకారణైః
కల్లయైన జగము గనుటెల్ల నిజమని
నమ్మి భ్రమను జిక్కి నాతిఁ గూడి
యెల్ల జనులు మఱతు రేకాంతుఁ డగుహరి
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.36
స్వప్నతుల్యం జగదిదం స్థిరం మత్వా భ్రమాన్వితాః
సంసారసుఖసంలగ్నా విస్మరన్తి మహేశ్వరమ్
కసవు దినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్టు వినుచుఁ జేయుఁ బనులు
వానిపాటి యైన మానవుఁ డొప్పఁడా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.37
గావస్తృణాశనాః కర్మ కుర్వతే పాలకాజ్ఞయా
తతోఽపి మనుజా నీచా హరిసేవాపరాఙ్ముఖాః
కసువులు దినువాఁడు ఘనఫలమురుచి
గానలేఁడు గాదె వానియట్లు
చిన్న చదువులకును మిన్న జ్ఞానము రాదు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.38
యథా స్వాదుఫలాస్వాదం న జానాతి పలాలభుక్
తథా ప్రాప్తాల్పవిద్యస్తు వేత్తి జ్ఞానగుణం కథమ్ ?
కుక్కతోఁక దెచ్చి గొట్టంబుఁ జేర్చిన
క్రోవి చెంతనుండు కొంతతడవు
ఎంత జెప్పఁ జెడుగు పంతంబు మానునా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.39
నాలబద్ధం శునః పుచ్ఛమార్జవం భజతే క్షణమ్
శిక్షాకాలే గుణీ మూర్ఖః, స్వభావో దురతిక్రమః
కుండ చిల్లివడిన గుడ్డ దోఁపఁగవచ్చు
పనికి వీలుపడును బాగుగాను
గూలఁబడిన నరుఁడు కుదురుట యరుదయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.40
వస్త్రఖణ్డావృతే రన్ధ్రే బిభర్తి సలిలం ఘటః
కృతేఽపి యత్నే మూర్ఖోయం నైవ ప్రాప్నోతి యోగ్యతామ్
ఖరముపాలు తెచ్చి కాచి చక్కెర వేయ
భక్ష్యమగునె యెన్న భ్రష్టుఁ డట్లె
యెంతఁ జెప్పి చివర నెసఁగింప బొసఁగునే
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.41
ఖరక్షీరం శర్కరాఢ్యమపి నాప్నోతి పేయతామ్
ఉపదేశశతైశ్చాపి మూర్ఖో న గుణవాన్ భవేత్
గాడ్దెమేనినిండ గంధంబుఁ బూసిన
బూదిలోనఁ బడుచుఁ బొరలు మరల
మోటువారి సొగసు మోస్తరియ్యదిసుమీ
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.42
సుగన్ధలిప్తకాయోఽపి పఙ్కే లుఠతి గర్దభః |
మూర్ఖః సత్కారమాప్యాపి న జహాతి స్వకం గుణమ్
గుడ్డు వచ్చి పిల్ల గోరడా లాడిన
విధముగా నెఱుఁగక వెఱ్ఱిజనులు
జ్ఞానులైనవారి గర్హింతు రూరక
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.43
చరన్తం శావకం దృష్ట్వా యథాణ్డో హసతి స్వయమ్
తథా జ్ఞానాధికం దృష్ట్వా మూఢాః పరిహసన్త్యహో
గురువునకును పుచ్చకూరైన నీయరు
అరయ వేశ్య కిత్తు రర్థ మెల్ల
గురుఁడు వేశ్యకన్న గుణహీనుఁడేమొకో
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.44
శాకం వా న ప్రయచ్ఛన్తి గురవే; గణికాకృతే
సర్వం ధనం ప్రయచ్ఛన్తి తాభ్యో హీనో గురుః కిము ?
గూబచేర గృహము గునిసి పాడుగఁ బెట్టి
వెళ్లిపోదు రెంత వెఱ్ఱివారొ
గూబగృహము లేమి కూర్చురా కర్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.45
ఉలూకః పతితో గేహేః” ఇతి మూఢాః స్వకాద్ గృహాత్
నిర్యాన్తి, కిములూకోఽయం దైవం భిన్నం కరిష్యతి ?
గ్రాస మింత లేక కడుఁ గష్టపడుచున్న
విద్య యేల నిలుచు వెడలుఁ గాక
పచ్చికుండ నీళ్ళు పట్టిన నిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.46
బుభుక్షితం నరం ప్రాప్య విద్యా న స్థైర్యమర్హతి
అపక్వే మృత్తికాకుణ్డే జలం న భవతి స్థిరమ్
చెఱకు తీపిలేమిఁ జెత్తనాఁ బడునట్లు
పరగు గుణము లేని పండితుండు
దూఱువడునుగాదె దోష మటుండఁగ
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.47
రసహీనేక్షుదణ్డేన సదృశో నిర్గుణో జడః
లోకైరనాదృతో భూత్వా పరే పాపం చ విన్దతి
చదివి చదివి కొంత చదువంగఁ జదువంగ
చదువు చదివి యింకఁ జదువు చదివి
చదువు మర్మములను జదువలేఁ డయ్యెను
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.48
అధీత్య సకలాం విద్యాం కృత్వా కణ్ఠగతాం చ యః
న విజనాతి తత్సారం  స భవేన్నిష్ప్రయోజనః
చందమెఱిఁగి మాటఁ జక్కఁగాఁ జెప్పిన
నెవ్వఁడైన మాఱిఁకేల పలుకు
చందమెఱిఁగియుండుసందర్భ మెఱుఁగుము
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.49
జ్ఞాత్వా సమయమౌచిత్యం వక్తవ్యం మధురం వచః
తథా చేన్నేతి వదితుం న కోఽపి భవతి క్షమః
జననమరణములకు సరి[3] స్వతంత్రుఁడు గాఁడు
మొదటఁ గర్తకాఁడు తుదను కాఁడు
నడుమఁ గర్తననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.50
జననస్య తథా మృత్యోః కారణం న హి మానవః
మధ్యే కర్తాహమిత్యుక్త్వా పరిహాస్యో భవేన్నరః
తగుదు తగ దటంచు తగువారు చెప్పిన
వినఁడు మొఱుకు చెడును గొనకు నిజము
మునులు చెప్పుధర్మముల మీర నింతెరా!
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.51
సద్వాక్యవిముఖా మూర్ఖాః క్లిశ్యన్తే స్వీయబుద్ధితః
అశృణ్వతాం సతాం వాక్యమియమేవ గతిర్భవేత్
తనదు బాగు గోరి ధర్మంబుఁ జెప్పినఁ
దిట్టుచుంద్రు మొఱకు లెట్టయెదుట
గడ్డివేయ పోట్లగొడ్డు కొమ్మాడించు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.52
మూర్ఖో ధర్మోపదేష్టారం సమక్షం నిన్దతి స్వయమ్
పశుర్వై తృణదాతారం శృఙ్గాభ్యాం తాడయేద్యథా
తనలో సర్వం బుండఁగఁ
దనలోపల వెదకలేక ధర వెదకెడి యీ
తనువులమో సెడు నెద్దుల
మనములఁ దెల్పంగవశమె మహిలో వేమా!        1.53
స్వదేహస్థం హరిం త్యక్త్వా తదర్థం లోకచారిణామ్
పశుతుల్యమనుష్యాణాం మనోభావం క ఈరయేత్
తన్నుఁ జూచి యొరులు దగ మెచ్చవలెనని
సొమ్ము లెఱవుఁబెట్టు నెమ్మిమీఱ
నొరులకొఱకు తాన యుబ్బుచునుండును
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.54
అన్యేషాం భూషణైః శ్రేష్ఠైరలఙ్కృత్య స్వకాం తనుమ్
లోకే ఖ్యాతిమభీప్సన్తో మూర్ఖాః ప్రీతా భవన్త్యహో
తలఁ దాఁకినపుడు తలఁతురు
తలక్రిందై పడినయపుడు తలవరు శివునిన్
పలుగాకు లిలను సాజము
కలనాఁ డెన్నరె యదేమి కర్మమొ వేమా.           1.55
కష్టే హరిం నరః స్తౌతి ధనాన్ధో న స్మరత్యపి
దుష్కర్మ కిమిదం, శ్రీశో ధనాఢ్యైర్నైవ చిన్త్యతే
తల్లి యున్న యపుడె తనదు గారాబము
లామె పోవఁ దన్ను నరయ రెవరు
మంచికాల మపుడె మర్యాద నార్జింపు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.56
జనన్యాం తు సజీవాయాం శోభతే బాలచేష్టితమ్
అర్జనీయం యశః సర్వైరనుకూలే విధౌ సతి
తామసంపుఁబనులు తగ వెందులకు నైన
తామసంబు నుడుగఁ దగు సుజనుఁడు
తామసంబు నెంచు ధరలోన మూర్ఖుండు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.57
కర్తవ్యం క్రియతాం శీఘ్రమాలస్యం త్యజ్యతాం సదా
ఆలస్యాత్ కార్యకర్తా యః స మూర్ఖ ఇతి గణ్యతే
తుమ్మచెట్టుకు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోననుండి వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.58
సార్ధం ఖదిరవృక్షేణ జాయన్తే కణ్టకా అపి
మూర్ఖే నాయం క్రమః; పూర్వం మౌర్ఖ్యం, మూర్ఖస్తతో భవేత్
దాన మరసి చేయు దాత దగ్గఱఁ జేరి
వక్రభాషణములు వలుకు మొఱకు
చందనతరువందు సర్ప మున్నట్లయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.59
మూర్ఖా దానగుణైర్హీనా దాతౄన్ వక్రోక్తిభిః సదా
నాశయన్తి యథా సర్పః ప్రాప్య చన్దనపాదపమ్
తాత జనించెఁ గన్యకకుఁ దండ్రులు తామును కుండ గోళకుల్
మాత పరానుకూలినియె మక్కువ ద్రౌపది భర్తలేవురు
నీతులు సెప్ప పాండవుల నీతులు నిట్టివటంచు నెన్నుచు
భూతలమందు నెంతయును బూమెలు చేసిరి వఱ్ఱివేమనా.         1.60 (ఉత్పలమాల)
కన్యకాయాః సుతో వ్యాసః కౌరవా గోలకాస్తథా
పాణ్డవాః కుణ్డకాశ్చేతి మూర్ఖో నిన్దతి భారతమ్
ధర్మ మన్న వినరు తనువు నమ్మిన నరుల్
యమునివారు వచ్చి యడలఁ జేసి
చొచ్చికట్ట తమరు చొరఁ బారఁ గలరొకో
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.61
దేహమేవ స్థిరం మత్వా ధర్మేషు విముఖా నరాః
యమదూతే సమాయాతే న శక్తా ఆత్మరక్షణే
నీటిలోని వ్రాఁత నిలువక యున్నట్లు
పాటిజగతి లేదు పరము లేదు
మాటమాటకెల్ల మారును మూర్ఖుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.62
న స్థిరం మూర్ఖవచనం జలే లిఖితవర్ణవత్
స బ్రూయాత్త్యక్తమర్యాదో భిన్నం భిన్నం క్షణే క్షణే

నీళ్ళువోసి కడిగి నిత్యము శోధించి
కూడువెట్టి మీఁదఁ గోక కట్టి
యేమిపాట్లొ పడుదు రీ దేహమునకయి
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.63
స్నాపనేనాన్నదానేన వస్త్రాలఙ్కరణాదిభిః
నరైర్నశ్వరకాయార్థం కియాన్ వా క్రియతే శ్రమః
పరగఁ దా నొసఁగఁడు పరులు చెప్పినదైన
నియ్యఁజాలక విధి నెసఁగువాఁడు
పొట్టు తినెడిలండి బువ్వలుపెట్టునా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.64
పరకీయం ధనం చాపి మూర్ఖో దాతుం న వాఞ్ఛతి 
పక్వమన్నం పరేభ్యస్తు కిము దద్యాత్తుషాశనః
పర్వతవనవాసి పరిణామవర్తన
కూపవాసి కెట్లు గుఱుతుపడును
బ్రహ్మదేవువెంటఁ బ్రాకృతుఁ డరుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.65
కూపభేకసధర్మాణః పర్వతే వన్యమశ్నతామ్
తత్త్వం మునీనాం న విదుర్బ్రహ్మాణం ప్రాకృతో యథా
పాముకన్న లేదు పాపిష్ఠి దగుజీవి
యట్టిపాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుఁ దెల్ప నెవ్వరివశమయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.66
భుజఙ్గమసమః పాపీ న చాస్తి జగతీతలే
యథోక్తం కురుతే సోఽపి కో మూర్ఖం శిక్షితుం క్షమః
పుట్టుఫలము లేని పురుషాధములు భువిఁ
బుట్ట నేమి లేక గిట్ట నేమి
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.67
అప్రయోజనజన్మా యః స జాతో వా మృతోఽపి వా |
సమః స్యాత్ స్త్రీముఖా భూమ్యాం కతి జాతా మృతాః కతి
పొట్లకాయ రాయి పొడుగుత్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుఁగుఁ
గుక్క తోఁకఁ గట్టఁ గుదురునా చక్కఁగా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.68
సర్పశాకో బద్ధశిలః పరిత్యజతి వక్రతామ్
మూర్ఖే శ్వపుచ్ఛే వక్రత్వం సర్వథా నాపగచ్ఛతి
బట్టిపెట్టి నాల్గు బానలచమురుతో
వండి శుద్ధిచేయ దండి యగునె?
పుట్టునందుకలుగు పూర్వపుణ్యంబున్న
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.69
కషాయం వస్తు కిం స్వాదు జాయతే తైలపాకతః
గుణదోషౌ కర్మమూలౌ న మూర్ఖః శిక్షణాద్ గుణీ
బండుబూతులాడు పరమనీచుండెన్న
దండివారి మేల్మి దా నెఱుఁగునె
చందనంబు ఘనత పంది యే మెఱుఁగును?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.70
సతాం శ్రైష్ఠథం న జానన్తి మూర్ఖాః సాధువినిన్దకాః
చన్దనస్య తు సౌగన్ధ్యం కథం జానాతు సూకరః
బౌద్ధమతమువారు బుద్ధి దైవం బని
యెచ్చుతక్కు వాడి తుచ్ఛమతిని
గాడిదెల గుమివలె గ్రక్కునఁ బడుదురు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.71
బుద్ధిరేవ పరం తత్వమితి బౌద్ధాః కువాదినః
అజ్ఞాః పతన్త్యధః శీఘ్రం నమ్రశీర్షాః ఖరా ఇవ
మఘవుఁ డైన నేమి మర్యాద యెఱుఁగని
వారలేల తెలిసి గౌరవింత్రు
ఉరిమి మొఱుగుకుక్క యోగినేమెఱుఁగురా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.72
ఇన్ద్రతుల్యాతిథేశ్చాపి పూజాం న కురుతే జడః
శ్వా యోగిసవిధే చాపి కిం త్యజేద్ గుర్గురస్వనమ్
మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
గష్టు లెందఱైనఁ గలరు భువిని
పసిడి లేదు కాని పదడెంత లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.73
మహాన్తో దుర్లభా లోకే సులభాః కష్టజీవినః
సువర్ణం దుర్లభం లోకే భస్మ సర్వత్ర లభ్యతే
మంత్ర మెల్ల మఱచి మధురాధరముఁ గోరి
ఎట్లు మొఱకు డొడయు నెఱుగఁ గలఁడు
ఉవిదఁ జూచి పరమయోగంబు మఱచును
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.74
కామ్యేచ్ఛయా నష్టమన్త్రో న స్మరేత్ మన్త్రదం గురుమ్
విస్మరన్తి జనా యోగమపి స్త్రీదర్శనాత్ కిల
మర్మ మెఱుఁగ లేని మనుజు లెల్లరు నిట్లు
మాలదాసరులకు మడుపు లిచ్చి
మహిని గాచునట్టిమనుకులం బెఱుఁగరు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.75
మనువంశే సముత్పన్నా వయమిత్యవిచార్య వై
మూఢాస్తత్త్వమజానన్తో నమన్తి కిల పఞ్చమాన్
మాటలాడఁగలుగు మర్మము లెఱిఁగిన
పిన్న పెద్దతనము లెన్న వలదు
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.76
శాస్త్రవిత్ స్యాన్మహాన్ లోకే, జ్ఞానం హేతుః న వై వయః
దీపో బాలకరస్థోఽపి కిం సమ్యక్ ప్రకాశతే
ముక్కు త్రాళ్ళఁ గ్రుచ్చి ముఱికి పోవఁగఁ దోమి
కచ్చనీరునించి కడిగికడిగి
డొక్క తోమినంత దొరకునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.77
ఘ్రాణే వస్త్రం ప్రవేశ్యాన్తరుదరక్షాలనేన వా
కౌపీనశోధనైవాపి యోగీ మోక్షం న విన్దతి
ముందరిపోటులు మాన్పను
మం దెందైనను గలుగును మహిలోపల నీ
నిందలపోటులు మాన్పను[4]
మం దెచ్చట కైనఁ గలదె మహిలో వేమా.          1.78
వ్రణస్య శస్త్రజాతస్య వర్తతే శమనౌషధమ్
నిన్దాజాతవ్రణస్యేహ నైవాస్తి శమనౌషధమ్
మ్రాను దిద్దవచ్చు మఱివంక లేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీఁద నెవరికి
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.79
అతివక్రౌ శిలావృక్షౌ సమీకర్తుం నరః క్షమః
స్వమానసం సమీకర్తుం న కోఽపి భువి శక్నుయాత్
మృగము మృగమనుచును మృగముల దూషింత్రు
మృగముకన్నఁ జెడుగు మూర్ఖుఁడగును
మృగముకున్న గుణము మూర్ఖునకే లేదు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.80
నరం దృష్ట్వా “పశుప్రాయో మృగోఽయమ్” ఇతి భాషణమ్
సత్యం న స్యాత్; మృగః శ్రేయాన్ మూర్ఖాత్ సర్వాత్మనా గుణైః
యౌవనమునఁ జూడ నది యెఱుకే లేదు
యౌవనంబు నెంతు రధికముగను
యౌవనంబు తనకు నందకయే ముంచు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.81
యౌవనం కాఙ్క్షతే మర్త్యః, తల్లబ్ధ్వా మోక్షచిన్తనమ్
అకృత్వా యౌవనేనైవ నాశం సమధిగచ్ఛతి
రాజుమా టనవలె రసికుఁ డాడఁగవలె
నెంతపనికి నుబికి యెగురరాదు
కదిసి యెగిరెనేని గ్రహసమానము గాదె
దొడ్డకొంచె మేల దొరకు వేమ?                      1.82
రసికం మధురాలాపే రాజానం కార్యసాధనే
యే జేతుమభివాఞ్ఛన్తి తే చిన్త్యన్తే గ్రహైః సమాః
ఱాయిరూపుఁ జేసి రాజుల మ్రొక్కింప
వన్నె కెక్కునటవె వైభవంబు
కర్త యెవ్వఁ డనుచు కానరు మూర్ఖులు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.83
న శిలావిగ్రహో రాజవన్దితః శక్తిమశ్నుతే
కః కర్తా కో హి భోక్తేతి మూర్ఖో నేదం సమీక్షతే
లెక్క లేనియాశ లీలమై యుండఁగాఁ
దిక్క యెత్తినరుఁడు తిరుగుఁగాక
కుక్కవంటిమనసు గూర్చుండనిచ్చునా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.84
ఆశాశతయుతా మర్త్యాః భ్రాన్త్యా భువమటన్తి చ
శ్వసమం చపలం చిత్తం తదేకత్ర కథం వసేత్
వనములోనఁ దిరుగువరమౌను లైనను
మనసు కుదరకున్న మమత చేత
చెడుదురన్న మొఱకు చెడుటేమి లెక్కరా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.85
మహర్షయో వనం ప్రాప్యాప్యలబ్ధ్వా చిత్తనిగ్రహమ్
నశ్యన్తి చేదహఙ్కారాత్ మూర్ఖం ప్రతి తు కా కథా
వాచవికిని మొగము వాచిన యట్టులు
నదియు నదియుఁ దినఁగ మొదలు వెట్ట
మరల దింక బుద్ధిమర్యాదపోయిన
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.86
కదాచిద్భుక్తభోగస్య భోగేచ్ఛా నైవ శామ్యతి
నివృత్తిర్విషయాత్ యుక్తా నో చేన్మూఢో వినశ్యతి
వాడవదినె కేల వావివర్తనములు
చాడిగాని కేల సత్త్వగుణము
మూఢమతుల కేల ముదముతో జ్ఞానము
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.87
బన్ధుర్న వేతి విజ్ఞానం వేశ్యాసు న భవేద్యథా
తథా న నిన్దకే సత్త్వగుణో, మూర్ఖే న సత్త్వధీః
వాదబుద్ధిచేత వాదంబు లాడఁగాఁ
బూనియుందురయ్య పుడమిలోన
కర్మ మార్గమునను గడతేర లేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.88
వృథా కాలం యాపయన్తి వృథావాదరతా జనాః
కర్మఠాస్త్యక్తసంసారాః ప్రయతన్తే న ముక్తయే
విష్ణుభక్తు లెల్ల వెలిబూదిపాలైరి
వాద మేల? మతవిభేద మేల?
తెలియ లింగధరులు తిరుమణి పాలైరి
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.89
వైష్ణవైః భస్మధరణాత్ శైవైః పుణ్డ్రస్య ధారణాత్
ప్రాప్తే చ సఙ్కరే వాదో భేదో వా క్రియతే కుతః
వెయ్యారునదుల జలములు
తియ్యక మఱిమునుగఁ బోవఁ ద్రిప్పట కాదా
కొయ్యగులాముకు జ్ఞానము
వెయ్యైనను తెలుపలేము వినరా! వేమా!            1.90
అజ్ఞానినో నదీస్నానగమనం స్యాత్ వృథాటనమ్
ఉపదేశశతైశ్చైనం మూర్ఖం కో వా నివారయేత్
వెఱ్ఱివేషములను వేసికోఁబోకుము
కఱ్ఱికుక్క తెలుపుగాదుసుమ్ము
పుఱ్ఱెలోనిగుణము పూడ్పింపఁజనవలె
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.91
జన్మసిద్ధం శునః కార్ష్ణ్యం జన్మసిద్ధో గుణో నృణామ్
సహైవ మృత్యునా యాతి తస్మాత్ జ్ఞానముపార్జయ
శక్తిమహిమ సోఁకి చెడిరయా పురుషులు
ముక్తిమహి మెఱుఁగక మూఢు లగుచు
ఆదిశక్తి గూడ నన్యాయమై పోయె
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.92
అజ్ఞాతమోక్షవిభవాః శాక్తేయా భోగకామ్యయా
మూర్ఖాః సన్తి, ఆదిశక్తిశ్చ వృథా భవతి దూషితా
శివునిమంత్రమే యగు శ్రీహరిమంత్రము
తెలిసి తెలియలేరు తిక్కనరులు
దేవుని మఱచి తమదేహమే యందురు
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.93
శైవవైష్ణవమన్త్రాణామభేదజ్ఞానవర్జితాః
మూర్ఖాః “శరీరం బ్రహ్మే”తి వాదం కుర్యురపి స్వయమ్
శ్రవణపుటము లున్న సార్థక్య మేమిరా
వినఁగవలయుఁ బెద్ద లనెడివన్ని
వినఁగ వినఁగ నీకె విశదంబులౌ సుమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.94
శ్రోతవ్యం మహతాం వాక్యం సత్యేవ శ్రవణేన్ద్రియే
శ్రవణాత్ క్రమశః సర్వం విదితం తే భవిష్యతి
సత్యము విడనాడి సాహసంబులుఁ జూపి
బంటుపంతమాడు బత్తి లేక
కర్మజీవి తానుగానంగ లేఁడయా
విశ్వదాభిరామ వినుర వేమ.                         1,95
అభక్తః సత్యవిముఖః మూర్ఖః సాహసకర్మకృత్ |
కర్తా జీవో న ఫలద’ ఇతి నో వేత్తి మన్దధీః
సాధుచరిత యైనసతిసత్ప్రవర్తన
జార యే మెఱుంగు సాధుజనుని
బ్రహ్మనిష్ఠ మొఱకుప్రాకృతుఁ డెఱుఁగునా?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.96
మూర్ఖో హి ప్రాకృతః, సన్తం బ్రహ్మజ్ఞం జ్ఞాతుమక్షమః
కులటా న హి జానాతి సాధ్వ్యాః సాధుప్రవర్తనమ్
హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
ఘనుఁడు గాఁడు మొఱకుజనుఁడె గాని
పరిమళముల గర్దభముమోయ ఘన మౌనె?
విశ్వదాభిరామ వినుర వేమ.                         1.97
శాస్త్రాభ్యసనమాత్రేణ మూర్ఖో న గుణవాన్ భవేత్
సుగన్ధవస్తుభరణాత్ శ్రేష్ఠో న స్యాద్యథా ఖరః
--::--


[1]మానక మూర్ఖుడౌఅని వావిళ్ళవారి ప్రతిలో
[2] కంటికావరము అని వావిఅవారి పాఠము
[3]దా స్వతంత్రుడుకాడు అని వావిళ్ళ
[4] నిందలఁ బల్కెడి మొఱకుకు

No comments:

Post a Comment